TDP

తిరుపతి: రాష్ట్రంలో లక్షలాదిమంది యువత భవిష్యత్తు కోసమే తాను యువగళం పాదయాత్ర చేపట్టానని, అరాచకపాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి నెం.1గా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోనని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన ప్రాంగణంలో హాలో Nara Lokesh పేరుతో యువతీయువకులతో ఉత్సాహంగా సాగిన ముఖాముఖి సమావేశం యువకులు అడిగిన ప్రతిప్రశ్నకు యువనేత సూటిగా సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, యువతీయువకులకు ఉద్యోగావకాశాల కల్పన, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిపథంలో గాడిన పెట్టడానికి తమవద్ద ఉన్న ప్రణాళికలను లోకేష్ స్పష్టంగా తెలియజేశారు. తిరుపతి నగరంతోపాటు జిల్లానలుమూలల నుంచి యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. యువతీయువకుల కేరింతలతో సమావేశ ప్రాంగణం మారుమోగింది.

ఒక యువకుడిగా సమాజంలో మార్పునకు ప్రయత్నిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే యువగళం పాదయాత్ర చేపట్టా.. వైసిపి పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్నవి కూడా పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అరాచకపాలనలో అధఃపాతాళానికి చేరిన ఏపీని తిరిగి అగ్రగామిగా నిలబెట్టేందుకు పాలనలో సమూల మార్పులు తీసుకొస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పు మొదలవుతుంది. చంద్రబాబు హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేశారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని నిలపడమే టిడిపి లక్ష్యం. టిడిపి హయాంలో ఐటీ మంత్రిగా చిత్తూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చా. ఇప్పటివరకు 350 కిలోమీటర్లు ప్రజల కోసం నడిచాను.. ప్రజల ఆశీర్వాదంతో 4 వేల కిలోమీటర్లు విజయవంతంగా నడుస్తా. టిడిపి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయని యువత చెబుతున్నారు. తిరిగి అధికారం చేపట్టాక వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.

అభివృద్ధి వికేంద్రీకరణను గతంలో అమలు చేశాం. నిజమైన అభివృద్ది ఎలా ఉంటుందో చేసి చూపించాం. జైలు చుట్టూ తిరిగే ఖైదీలను గద్దె దించాలి. గాలికి వచ్చిన వాళ్లు గాలికే కొట్టుకుపోతారు. దొంగల చుట్టూ దొంగలు, రౌడీ షీటర్ చుట్టూ రౌడీలే ఉంటారు. మన భవిత గురించి మాట్లాడే పాలకులు కావాలి. మనం ఆశించే మార్పు కోసం యువతీ, యువకులు నాతో కలిసి రండి. మన రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మీ కోసం పనిచేసిన ఏపీని అగ్రస్థానంలో నిలిపే వరకు విశ్రమించను.

*అహమ్మదాబాద్ కు చెందిన ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా ఆసక్తికరంగా సాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లోకేష్ నిర్మొహమాటంగా తన మనోభావాలను వ్యక్తపర్చారు.*

ప్రశ్న: మీరు బాగా ఉన్నత కుటుంబం నుండి వచ్చారు. బడుగు,బలహీనవర్గాల గురించి అవగాహన లేదని కొంత మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెబుతారు?

లోకేష్: మా తాత ఏపీ కి పూర్వపు సీఎం, మా నాన్న ఏపీకి సుదీర్ఘకాలం సీఎం. సమాజంలో మార్పును ఏమైతే మనం ఆశిస్తున్నామో దాన్ని ఒక యువకుడిగా తీసుకురావాలని నేను సంకల్పించాను. నన్ను వైసీపీ వాళ్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నేను పట్టించుకోలేదు. నా లక్ష్యం రాష్ట్రాభివృద్ధి మాత్రమే. మా కుటుంబం భోజన సమయంలో కూడా రాష్ట్ర సమస్యలపై చర్చిస్తాం. నేడు పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకునే అవకాశాన్ని తీసుకున్నాను. అన్ని సమస్యల్ని తెలసుకుంటున్నాను. పరదాల చాటున దాక్కున్న సీఎం కంటే ఎక్కువ అవగాహన నాకు ఉంది.

ప్రశ్న: యువతకు మీరు ఏం చేశారని మీ వైపుకు వస్తారు?

లోకేష్: చిత్తూరు జిల్లా యువతకు ఐటీ,ఎలక్ట్రానికి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోహో, సెలకాన్, ఫాక్స్కాన్, టీసీఎల్ తెచ్చాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూడా అందించాం. దాన్ని స్వీకరించే పరిస్థితి లేకుండా పోయింది. యువతను పార్టీలో పెద్దఎత్తున ప్రోత్సహించింది టీడీపీ. అందుకే నాకు 100శాతం యువతతో కలిసి నడవడానికి, వాళ్లు నాతో రావడానికి అవకాశం ఉంది.

ప్రశ్న: 350కిలోమీటర్లు(9శాతం) పాదయాత్ర పూర్తయ్యింది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అడ్డంకులు ఏవిధంగా ఎదుర్కొంటూ మిగతా యాత్రను పూర్తిచేస్తారు?

లోకేష్: తగ్గేదే లే….ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టుకోమనండి. సహకరిస్తే ఇది పాదయాత్ర…లేకుంటే దండయాత్రే…అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. ఇది యువత కోసం చేస్తున్న పాదయాత్ర. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువత కోసం లోకేష్ అనే వ్యక్తి ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు. అడ్డంకులను అధిగమిస్తాం..యువత కోసం పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేస్తాం.

ప్రశ్న: ఇప్పటి వరకు పూర్తయిన 350కిలోమీటర్ల పాదయాత్రలో మీకు ఆనందం కలిగించిన అంశాలేంటి?

లోకేష్: రాష్ట్ర ప్రజలు నిజమైన అభివృద్దిని కాదనుకుని మోసం చేసే ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చుకున్నారోనని బాధపడుతూ ఉండేవాడిని. కానీ మన ప్రభుత్వంలో మనం తెచ్చిన కంపెనీలను చూస్తున్నప్పుడు, అందులో ఉద్యోగులు నాతో తమ సంతోషాన్ని పంచుకున్నప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా బాధ మొత్తాన్ని మరిచిపోయాను. నా ఉత్సాహం ఆ కంపెనీలను చూశాక రెట్టింపయ్యింది.

ప్రశ్న: మీ పాదయాత్రలో మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు? మీ విజన్ ఏంటి?

లోకేష్: నా ఉద్దేశం, TDP ఉద్దేశం ఒక్కటే. ఇంకా ఎన్నాళ్లు మనం ఇబ్బందులు పడాలి? పక్క రాష్ట్రాలకు పొట్టకూటికోసం ఎందుకు వలస వెళ్లాలి? మన రాష్ట్రంలో మనం బ్రతకలేమా? ఇతర రాష్ట్రాల వాళ్లు మన రాష్ట్రానికి వలసలు వచ్చేలా చేయాలి, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ రావాలనేదే మా ఉద్దేశం. అన్ని రంగాల్లో ఏపీని అగ్రస్థానంలోకి తీసుకురావడమే నా అంతిమ లక్ష్యం. హైదరాబాద్ మాత్రమే కాదు…ప్రతి జిల్లాలో హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళతాం. అదే పార్టీ అజెండా..ఈ లోకేష్ అజెండా .

*యువత అడిగిన ప్రశ్నలపై యువనేత సమాధానాలు*

ప్రశ్న: బాలయ్య అంటే మీకు ఎంత అభిమానం?

లోకేష్: నేను వాల్తేరు వీరయ్య సినిమా చూశాను. నేను మెగాస్టార్ అభిమానిని. ఎంతైనా బాలయ్య నా ముద్దుల మామయ్యను అభిమానిస్తాం. ఆయన అన్ స్టాపబుల్. ఆయన రిలీజ్ సినిమాకు మొదటి షోకు మొదటగా ఉండేది ఈ లోకేష్.

ప్రశ్న: టీడీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలుంటాయా?

లోకేష్: టీడీపీ ప్రభుత్వం రాకముందు ఉన్న ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మేం కొనసాగించాం. ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రతి వ్యక్తిమీద, చివరకు పుట్టబోయే బిడ్డపై కూడా రూ.2.5లక్షల అప్పును చేశాడు. ఏపీకి సంక్షేమం అవసరం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరం. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి. ఇది కొనసాగితేనే యువత భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. ఏకపక్షంగా ఉంటే ఇబ్బందులు తప్పవు.

ప్రశ్న: మీరు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారా?

లోకేష్: విభజన మనం కోరుకున్నది కాదు. పార్లమెంటులో ఆనాడు మన ఎంపీలు పోరాడారు. ఆ పోరాటం వల్లే హోదా హామీ వచ్చింది. కానీ దీన్ని కేంద్రం నిలబెట్టుకోలేదు. దక్షిణభారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏపీనే. 2019కు ముందు హోదా కోసం పోరాడినా..ఫలించలేదు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా అంశం గురించి మాట్లాడడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళుతున్నాడు. ఎందుకు వెళ్లాడో ఎవరికీ చెప్పలేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తమ కేసులు, బాబాయ్ ని చంపిన కేసులు మాఫీ చేయాలని ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడం తప్ప వేరే ఏమీ జరగడం లేదని మాకు తెలిసింది. షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న అంశాలపై పోరాడడం లేదు. టీడీపీకి ఉన్న నలుగురు ఎంపీలు మాత్రమే ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నారు. 31మంది ఎంపీలున్న వైసీపీలో ఒక్క ఎంపీ కూడా ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలపై నోరెత్తడం లేదు. ఈ విషయాన్ని యువత ఆలోచించాలి.

ప్రశ్న: గతం కంటే మీరు ఇప్పుడు చాలా స్లిమ్ గా, ఫిట్ గా ఉన్నారు. దీని రహస్యం ఏంటి?

లోకేష్: నా స్లిమ్, ఫిట్ నెస్ కు కారణం బ్రాహ్మణి. కోవిడ్ సమయంలో 2సంవత్సరాలు నేను ఆమెకు దొరికిపోయాను. ప్రతిరోజు పరిగెత్తించేది, నా డైట్ ను కంట్రోల్ చేసేది. ప్రస్తుతం పాదయాత్రలో నేను ఇక్కడ ఏం తిన్నా తనకు తెలిసిపోతోంది. నా సీక్రెట్, నా సక్సెస్ నా భార్య బ్రాహ్మణీనే.

ప్రశ్న: మీ తాత అన్న నందమూరి తారకరామారావు ఓ పెద్ద లెజెండ్. మీ తండ్రి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఇప్పుడు మీపై ఏమైనా ఒత్తిడి ఉందా?

లోకేష్: ఒత్తిడి కంటే బాధ్యత ఎక్కువ నాపై ఉంది. యువతకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలన్ని ఆలోచన నాలో ఉంది. ఆ బాధ్యతే నాలో పెరిగింది.

జ్యోతిక: స్కాలర్ షిప్ లను ఈ ప్రభుత్వం నిలిపేసింది. అధికారంలోకి వచ్చాక పునరుద్దరిస్తారా?

లోకేష్: పాదయాత్రలో నన్ను చాలా మంది కలిశారు. ఇచ్చే రూ.10వేలు నామమాత్రంగానే ఇస్తున్నారు. విద్యాదీవున, వసతిదీవెన ఓ దరిద్రపు పథకాలు. మీకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో సమస్య ఉండేది కాదు. యాజమాన్యంతో ప్రభుత్వం నేరుగా మాట్లాడి మీ ఫీజులు కట్టేది. కానీ నేడు సర్టిఫికెట్లు కావాలంటే మీరే బకాయిలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని తీసుకొస్తాం. 2024లో ఎవరు సీఎం అయినా ఇబ్బందులు తప్పవు. రూ.10లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఏడాదికి రూ.1.20లక్షల కోట్లు వడ్డీ కట్టాలి. సీఎం పదవి ఒక ముళ్లకిరీటం లాంటిది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన వ్యక్తి చంద్రబాబు. 1994లో ఇటువంటి పరిస్థితులే వచ్చాయి. కష్టకాలంలో చంద్రబాబు గుర్తొస్తారు..అన్నీ చక్కబెట్టాక ప్రజలు మరిచిపోతున్నారు.

అక్షయ్: నిత్యావసరాల ధరలు పెరిగాయి, అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా?

లోకేష్: పేదవాళ్లకు మూడు పూటలా భోజనం పెట్టే ప్రతిష్టాత్మక పథకం అన్న క్యాంటీన్. దీన్ని అత్యంత క్రూరంగా మూసేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో మూసేసిన అన్న క్యాంటీన్లను తెరిపిస్తాం. పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కంటే రూ.11 తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. మనం అధికారంలోకి వచ్చాక ఈ ధరలు తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గిస్తాం.

ప్రశ్న: పింక్ డైమండ్ లొల్లి ఏంది అన్న? అది మీ దగ్గరుందా? ఉంటే ఎప్పడిస్తారు?

లోకేష్: ఈ పింక్ డైమండ్ లొల్లి నాకే అర్థం కావడం లేదు. చంద్రబాబు పాలనలో తిరుపతి వెంకన్న పింక్ డైమండ్ కొట్టేశామని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళితే వాళ్ల పని గోవిందా..గోవిందా. అన్ని కొండలు ఎందుకు అని మాట్లాడిన వారు ఏమయ్యారో మనం గతంలో చూశాం. ఎవరైతే మాపై ఆరోపణలు చేశారో ఈ నాలుగేళ్ల వాళ్ల పాలనలో ఏం పీకారు? ఎన్నికల తర్వాత పింక్ డైమండ్ గురించి మాట్లాడారా? ఆరోపణలు చేయడం చాల ఈజీ..నేను ఏనాడూ తప్పు చేయలేదు. అందుకే తిరుపతి నడివీధుల్లో నడుస్తున్నాను. తప్పు చేసిన వ్యక్తి పరదాలు కట్టుకుని బయటకు వస్తున్నాడు. పింక్ డైమండ్ గురించి విజయసాయిరెడ్డినే అడగాలి.

తేజేష్: నాణ్యమైన విద్యను టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా ఇస్తారు?

లోకేష్: కేజీ టు పీజీ విద్యలో మార్పులు జరగాలి. మెరుగైన సిలబస్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ తీసుకొస్తాం. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం. నాణ్యమైన విద్య 100శాతం మొదటి సంవత్సరంలోనే తీసుకువస్తాం. దానికి అవసరమైన సిలబస్ ను తీసుకొస్తాం.

ప్రశ్న: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా?

లోకేష్: నూటికి నూరుశాతం స్వాగతిస్తాం. రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ముందుకొచ్చేవారిని టీడీపీ ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. మంచి మనసున్నవాళ్లు వస్తే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. పవన్ కళ్యాణ్ ను 2014లో నేను మొదటిసారిగా కలిశాను. ఏపీలో మంచి ప్రభుత్వం, ఏపీలో మంచి మార్పు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని కాంక్షించారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్లకు మేం రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంచాం. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి వాళ్లను రాష్ట్రాభివృద్ధి కోసం ఆహ్వానిస్తున్నాను.

ప్రశ్న: ఏపీకి ఐపీఎల్ టీమ్ రావాల్సిన అవసరం ఉందా?

లోకేష్: నేను ఎప్పడూ కన్నీరు పెట్టలేదు. దేవాన్ష్ పుట్టినప్పుడు తనను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందబాష్పాలు వచ్చాయి. ఏపీకి ఐపీఎల్ టీమ్ కావాలి. మన రాష్ట్రంలోని క్రీడాకారులు నేషనల్ స్థాయికి వెళ్లి సరైన ప్రోత్సాహం లేక ఆగిపోతున్నారు. తిరుపతికి స్పోర్స్ట్ యూరివర్శిటీ ఎందుకు రాకూడదని పుల్లెల గోపీచంద్ తో నేను చర్చించా. క్రీడల్లో ఏపీ నంబర్ వన్ కావాలనే ఉద్దేశంతో గతంలో మేము పనిచేశాం. వచ్చే కాలంలోనూ పనిచేస్తాం.

గోవింద్, ఎంబీఏ విద్యార్థి, ఆదోని: మీరు పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారు. మీ స్పందన ఏంటి?

లోకేష్: మీ సమస్యలపై నేను గళం విప్పుతున్నాననే పోలీసులు నా గొంతు నొక్కుతున్నారు. మైక్ లాక్కుంటున్నారు. చివరకు నేను నిలబడే స్టూల్ కూడా లాక్కుంటున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వం చేతిలో బాధితులుగా మారారు. నాపై ఇప్పటికి 20కేసులు పెట్టారు. కానీ మీ కోసం తగ్గేదే..లే… డీజీపీకి చెప్పాను…భయం నా బయోడేటాలో లేదని. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని పోలీసులకు చెప్పాను. మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తుకోసం జైలుకెళ్లడానికైనా నేను సిద్ధం.

రాజశేఖర్: వైసీపీ పాలనలో 14లక్షల మంది యువతకు ఉద్యోగాలు పోయాయి. మరో 25లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి మీరు ఏ విధంగా సాయం చేస్తారు?

లోకేష్: రాష్ట్రంలోని యువత నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ చిన్న హోటల్ నడుపుకునే తల్లి తన ఇద్దరు కొడుకులను కష్టపడి ఎంబీఏ చదివించింది. మనం అధికారంలోకి వచ్చాక తన పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరింది. ఆటో డ్రైవర్లు కూడా తమ పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. నా యువగళంలో నా దృష్టికి వచ్చే సమస్యల్లో ప్రధానంగా నిరుద్యోగ సమస్యలే వస్తున్నాయి. ప్రైవేటు రంగంలో పెట్టబడులు ప్రోత్సహిస్తాం. వాళ్లకు సహకరిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోరే యువతకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఇండస్ట్రీలకు టై అప్ చేసి వారికి సహకరిస్తాం. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. ఏపీలో నిరుద్యోగ సమస్యలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడతాం.

ప్రశ్న: మీరు గతంలో మంగళగిరిలో ఓడిపోయారు. నేడు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మీ ప్రణాళిక ఏంటి?

లోకేష్: మంగళగిరిలో టీడీపీ ఇప్పటికి రెండు సార్లే గెలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని టీడీపీ కి కంచుకోటగా మార్చాలనేది నా దృఢ సంకల్పం. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. మంగళగిరిలో 2024లో టీడీపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుంది. మీరు రాసిపెట్టుకోండి.

ప్రశ్న: ప్రతిరోజూ పాదయాత్ర పూర్తయ్యాక మీరు ఏం చేస్తారు?

లోకేష్: పాదయాత్ర అయ్యాక ఎన్ని కిలోమీటర్లు నడిచినా చల్లటి నీళ్లలో కాళ్లు పెట్టుకోవాలని నాన్న గారు సూచించారు. నా పాదయాత్ర పూర్తయ్యాక చల్లటి నీళ్లలో కాళ్లు పెట్టుకుని ఆరోజు జరిగిన విషయాలపై సీనియర్ నాయకులతో చర్చిస్తాం. మా టీమ్, స్థానిక నాయకులతో సరదాగా మాట్లాడుతూ ఉంటాం. అది పూర్తయ్యాక ఫ్రెండ్స్ అనే టీవీ షో ఉంది. నా కాలేజీ సమయంలో అది పాపులర్ షో. స్నేహితుల మధ్య సరదాగా జరిగే ఓ సంభాషణ. ఓ ఎపిసోడ్ చూసి పడుకుంటాను.

ప్రశ్న: మహిళల సాధికారత కోసం మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు?

లోకేష్: ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయి. దానికి కారణం అధికారంలో ఉన్న నాయకుల ప్రవర్తన. ఓ మహిళా మంత్రి నాకు చీరలు, గాజులు పెడతానని చెప్పింది. మహిళల్ని ఆమె అవమానించింది. నాకు చాలా బాధ వేసింది. ఆ చీర, గాజులు నాకు పంపు వాటిని నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పా. మహిళల్ని గౌరవించడం ఇంటి నుండే అలవాటు కావాలి. మహిళల్ని గౌరవించడం మనకు ఎల్.కే.జీ నుండి నేర్పించాలి. మహిళా సాధికారత మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. మా ఇంట్లో నా తల్లి, భార్య సంపాదిస్తే నేను నా తండ్రి ఖర్చుపెడుతున్నాం. మహిళలకు ఉపాధి, సాధికారత దిశగా నడిపించే బాధ్యతను మనం అవలంభించాలి. గతంలో మనం మహిళల్ని సాధికారత దిశగా నడిపించాం. అధికారంలోకి వచ్చాక మళ్లీ కొనసాగిస్తాం. టీడీపీ పాలనలో మహిళలకు ఓ వేదిక ఇస్తాం. ఇండస్ట్రీయల్ క్లస్టర్, కారిడార్ లో మహిళలకు పరిశ్రమలు పెట్టేలా అవకాశాలు గతంలో ఇచ్చాం. భవిష్యత్తులోనూ ఇస్తాం.

2).ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం! సబ్సిడీతో ఎలక్ట్రికల్ వాహనాలు అందిస్తాం పట్టణాల్లో అన్ని సౌకర్యాలతో ఆటోస్టాండ్లు ఏర్పాటుచేస్తాం ఆటో కార్మికుల సమావేశంలో టిడిపి యువనేత నారా లోకేష్

తిరుపతి: టిడిపి ప్రభుత్వం వచ్చాక ఆటోడ్రైవర్ల సంక్షేమం బాధ్యత నేను తీసుకుంటా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుపతి అంకుర హాస్పటల్ సమీపంలోని విడిది కేంద్రంలో ఆటోయూనియన్ ప్రతినిధులు, ఆటో కార్మికులతో లోకేష్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆటో కార్మికుల కోసం త్రాగునీరు, టాయిలెట్ లాంటి మౌలిక వసతులతో ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆటో ఇన్స్యూరెన్స్ అన్ని బోర్డు ద్వారా తక్కువ ధరకు అందిస్తాం. టిడిపి పాలనలో పోలీసుల వేధింపులు లేకుండా చేస్తాం. సబ్సిడీ తో ఎలక్ట్రిక్ ఆటో లు అందజేస్తాం. ఆటో స్టాండ్స్ లోనే ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డీజల్ రూ.60లు.. ఇప్పుడు రూ.100కు చేరింది..పెట్రోల్ రూ.112కు పెరిగింది. ఆటో వాళ్లను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ఏనాడూ అనుకోలేదు. ఆటో డ్రైవర్ల నుండి డబ్బులు వసూలు చేయాలని పోలీసులకు చంద్రబాబు టార్గెట్ ఇవ్వలేదు. తన పాదయాత్రలో వాహనమిత్రను ఆటోకార్మికులందరికీ ఇస్తానని హామీ ఇచ్చారు.  13 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉంటే 10 శాతం మందికే వాహనమిత్ర ఇస్తున్నాడు. ఫైన్లు వేయాలని పోలీసులకు టార్గెట్లు ఇచ్చి ఆటో సోదరుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చలానాపైనాలపైన కూడా ఫైన్లు వేస్తూ వేధిస్తున్నాడు. టీడీపీ రాగానే ఆటో డ్రైవర్ల పట్ల పోలీసు వేధింపులకు చెక్ పెడతాం. ఎటువంటి నిబంధనలు లేకుండా సంక్షేమ పథకాలు పేదలకు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. ఆటో డ్రైవర్లు రోజుకు 14 గంటలు కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే రోజుల్లో అనివార్యం. ప్రభుత్వం నుండి సబ్సీడీలు పెంచి, ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం. ఏడాది మొత్తం మీద కరెంట్ కాల్పు తీసుకుంటే విద్యుత్ రీడింగ్ సమస్య ఉండదు. ఈ విధానాన్నే మేము మళ్లీ తీసుకొస్తాం. ఈ – ప్రగతి విధానం గతంలో తీసుకొచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని తీసేసింది. అధికారంలోకి రాగానే నేరుగా మీ వాట్సాప్ లోకే కొత్త రేషన్, ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తాం. Nara Chandrababu Naidu మళ్లీ సీఎం అవ్వగానే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గిస్తాం.

తమ సమస్యలను నారా లోకేష్ తో విన్నవించుకున్న ఆటో డ్రైవర్లు

వాహనమిత్ర ద్వారా రూ.10 వేలు వందలో ఒకరికే ఇస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, ఒకరిని ఎక్కువ ఎక్కించుకున్నారన్న సాకుతో ఫైన్లు వేస్తున్నారు. నో పార్కింగ్ పేరుతో వేలకు వేలు చలానాలు వేస్తే మేము ఆటోలు ఎలా నడుపుకోవాలి? టీడీపీ ప్రభుత్వంలో లైఫ్ ట్యాక్స్ మినహాయించి చంద్రబాబు మాకు మంచి పని చేశారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయిస్తుందని చంద్రబాబు చెప్పారు..కానీ ప్రభుత్వం మారిపోయింది. మాకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయించాలి. మీటర్లు ఎక్కువగా తిరుగుతున్నాయి..దీంతో రేషన్ కార్డు తీసేస్తున్నారు.

ఆటో కార్మికుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

లోకేష్ కు మా కుటుంబం రుణపడి ఉంటుంది -షేక్.హమీద్ బాషా(నగరి, ఆటో డ్రైవర్)

ఈనెల 14వ తేదీన నగరిలో మంత్రి రోజాకు తెలుగు మహిళలు  చీరా, జాకెట్, గాజులుఇవ్వాలని రోజా ఇంటికి వెళ్లారు. వారిని నా ఆటోలోనే తీసుకెళ్లా. నాయకురాళ్లతో పాటు నన్ను కూడా అరెస్టు చేసి స్టేషన్ లో పెట్టి, నా వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. మాకు ఆటోనే జీవనాధారం. ఆటో ఇవ్వండని ఎంత అడిగినా పోలీసులు ఇవ్వలేదు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో మా బాధను అర్ధం చేసుకుని అడగకుండానే రూ.3.35లక్షలతో నారా లోకేష్ నాకు కొత్త ఆటో కొని ఇచ్చారు. లోకేష్ సహకారం మర్చిపోలేనిది. పాత ఆటో పోయి నాకు కొత్త ఆటో వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటా. లోకేష్ ను కలసి ధన్యవాదములు చెప్పేందుకు నగరి నుండి నా కుటుంబ సభ్యులతో వచ్చా.

మా అమ్మకు పెన్షన్ తీసేశారు! -ఆటో డ్రైవర్ చిరంజీవి, తిరుపతి

నాకు ఒక్కసంవత్సరమే వాహన మిత్ర వచ్చింది. తర్వాత సంవత్సరం రాలేదు. ఎందుకు రాలేదంటే మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందన్నారు. ఎండాకాలం ఎవరికైనా కరెంట్ కాల్పు ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని మా అమ్మకు పెన్షన్ కూడా ఆపేశారు. 3 వందలు యూనిట్లు దాటిన ఆటో డ్రైవర్లకు రేషన్ కార్డు తీసేశారు.

వాహనమిత్ర అందడం లేదు -ఆటో డ్రైవర్ రమాదేవి, తిరుపతి

చంద్రబాబు ఉన్నప్పుడు డీజల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం ఇచ్చే వాహనమిత్ర మాకు అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోకే మేము ఆటో తోలుతున్నాం. మాకు ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇస్తామంది..ఇవ్వలేదు. సంపాదించే డబ్బులు అద్దెలకు పోతున్నాయి. కష్టపడి ఆటో నేర్చుకుని జీవిస్తున్నాం. ఆటోస్టాండు ఏర్పాటుతో పాటు ఇళ్లు కూడా విప్పించాలి.

Also Read:Yuvagalam Padayatra: A Walk of Perseverance despite of obstacles and hurdles at Every Step

Tagged #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh #Yuvagalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *